రాజీ మార్గమే రాజ మార్గం.. రాజీ పడడానికి అవకాశం ఉన్న అన్ని కేసులలో రాజీ పడవచ్చు... జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ రాజగోపాల్
జిల్లా కోర్టు లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
రాజీ మార్గమే రాజా మార్గమని, రాజీ పడదగ్గ కేసులలో రాజీ పడి సత్వర న్యాయం పొందాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. రాజగోపాల్ అన్నారు. శనివారం చేపట్టిన జాతీయ లోక్ అదాలత్ పురస్కరించుకుని సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ, లోక్ అదాలత్ లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోని త్వరితగతిన కేసులను పరిష్కరించుకోవాలని అన్నారు. రాజీ మార్గంలో కక్షిదారులు లోక్ అదాలత్ లను సద్వినియోగం చేసుకొని తమ కేసులను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్నారు. కేసులను రాజీతో ముగించేందుకు ఇలాంటి లోక్ అదాలత్ లు ఉపయోగ పడతాయన్నారు. ఎలాంటి ఫీజు లేకుండా న్యాయ సేవా సంస్థ సహకారంతో కేసులను పూర్తి చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
కేసులు రాజీ చేసుకోవడం ద్వారా అప్పీలు చేసుకోవడం ఉండదని, కోర్టు చుట్టూ తిరిగితే సమయం, డబ్బు వృధా అవుతుందని, కేసుల పరిష్కారంతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని, లోక్ అదాలత్ ద్వారా కేసులను త్వరితగతిన పరిష్కరించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
గత లోక్ అదాలత్ ద్వారా జిల్లాలో 10 వేల 500 కేసులు పరిష్కరించినట్లు, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ లోక్ అదాలత్ లో 12 వేల కేసులు పరిష్కారానికి లక్ష్యంగా నిర్దేశించినట్లు, భాగస్వాములందరూ లక్ష్య సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. లోక్ అదాలత్ పురస్కరించుకుని జిల్లాలోని కోర్టుల్లో 9 లోక్ అదాలత్ ప్రత్యేక బెంచ్ లు ఏర్పాటుచేస్తామన్నారు.
క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, వైవాహిక జీవితానికి సంబంధించిన కేసులు, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ కేసులు, రోడ్డు ప్రమాదం, డ్రంక్ అండ్ డ్రైవ్, పెట్టి కేసులు, ఇతర రాజీపడ్డ దగిన కేసుల్లో కక్షిదారులు రాజీ పడాలని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
లోక్ అదాలత్ ద్వారా రాజీ మార్గంలో కేసుల పరిష్కారంతో కక్షిదారుల మధ్య సుహృద్భావ వాతావరణం తో పాటు, గ్రామాల్లో ప్రశాంతత నెలకొంటుందని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. లోక్ అదాలత్ లో ఒకరు గెలవడం, ఒకరు ఓడడం ఉండదని, ఇద్దరు విజేతలేనని ప్రధాన న్యాయమూర్తి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా లోక్ అదాలత్ కేసులకు సంబంధించి ప్రమాదంలో భర్త మరణించిన వసంత కు 14 లక్షల సెటిల్ మెంట్ కు సంబంధించి, ఉషారాణి-శివ ల ఫ్యామిలీ కేసుకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి కె. ఉమాదేవి, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి చంద్రశేఖర రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నెరేళ్ల శ్రీనివాసరావు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List