ప్రజా పంపిణీ ద్వారా సబ్సిడీపై శనగపప్పు విక్రయం
శనగ పప్పు నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో..
ప్రజా పంపిణీ ద్వారా దేశవ్యాప్తంగా సబ్సిడీపై పంపిణీ
న్యూస్ ఇండియా తెలుగు:ప్రతినిధి
హైదరాబాద్
శనగ పప్పు నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో.. ప్రజా పంపిణీ ద్వారా దేశవ్యాప్తంగా సబ్సిడీపై పప్పును విక్రయించేందుకు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఈ బాధ్యతలను హైదరాబాద్ వ్యవసాయ సహకార సంఘం,హాకా,కు అప్పగించింది…
భారత్ దాల్’ పేరిట అక్టోబర్ 1తేది నుఁడి హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. దీనిద్వారా 50 వేల టన్నుల శనగపప్పును హాకా రాష్ట్రంలో విక్రయించనుంది. శనగ నిల్వలు భారీగా ఉండడంతో మొదటిదశలో వాటిలో 20 శాతం సబ్సిడీపై విక్రయించేందుకు వీలుగా కార్యక్రమాన్ని కేంద్రం చేపట్టింది.
దీనికోసం దేశవ్యాప్తంగా ప్రభుత్వ మార్కెటింగ్ సంస్థలను పరిశీలించింది.తెలంగాణలో హాకాకు ఈ అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. 18 రాష్ట్రాల్లో 5000 సంచార వాహనాల ద్వారా విక్రయాలు చేపట్టనుండగా.. తెలంగాణలో 200 ఆటోల ద్వారా విక్రయించనున్నారు. ఈ పథకం కింద శనగపప్పు కిలో విడిగా రూ.60కి విక్రయిస్తారు.
30 కిలోల బస్తా తీసుకుంటే కిలో రూ.55 ధరకే లభిస్తుంది. వినియోగదారులతో పాటు దేవాలయాలు, ధార్మిక సంస్థలు, జైళ్లు, పోలీసు శాఖలకు విక్రయించేందుకు కేంద్రం అనుమతించింది.
దీంతోపాటు ప్రభుత్వేతర సంస్థలు, చిల్లర, టోకు వ్యాపారులు, షాపింగ్ మాల్స్, ఇ-కామర్స్ సంస్థలు, ఆసుపత్రులు, సామూహిక వంటశాలలు, ప్రాథమిక సహకార సంఘాలకు సైతం 30 కేజీల సంచులను విక్రయించనున్నారు.
సాధారణ శనగపప్పును మార్కెట్‌లో కిలో రూ.90కి విక్రయిస్తుండగా సబ్సిడీ పథకం ద్వారా విక్రయించే భారత్ దాల్ రూ.60కి లభించనుండటంతో కిలోకి రూ.30 మేర ఆదా అవుతుంది
Comment List