నా కుటుంబంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు:
తీన్మార్ మల్లన్న తన కుటుంబ సభ్యులపై అసత్య ప్రచారం చేస్తున్నారని
పల్లా రాజేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: కనీస అవగాహన లేకుండా తీన్మార్ మల్లన్న తన కుటుంబ సభ్యులపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆయనపై కోర్టులో పరువు నష్టం దావా వేస్తామని బీఆర్‌ఎస్ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక నా భార్య నీలిమకు విద్యుత్ శాఖలో అక్రమంగా ఉద్యోగం ఇచ్చినట్లు తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆమె ఏపీఎ్‌సఈబీ బోర్డు పరీక్షల్లో టాప్ మార్కులతో 1992లోనే (31 ఏళ్ల కిందట) ఏఈ ఉద్యోగం సాధించారు. ఆ తర్వాత ఏడీఈగా, 2015లో డివిజనల్ ఇంజనీర్‌గా పదోన్నతి పొందారు. నేను పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రావడంతో నీలిమ 2020 నవంబరు 19న ప్రభుత్వం ఉద్యోగం నుంచి వీఆర్‌ఎస్ తీసుకున్నారు. ప్రస్తుతం అనురాగ్ విద్యాసంస్థలకు సీఈఓగా పనిచేస్తున్నారు. బీఆర్‌ఎస్ సర్కారులో ఉద్యోగం పొంది.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగానికి రాజీనామా చేశారని తీన్మార్ మల్లన్న అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదు. ఆయనే చాలా మందిని బ్లాక్‌మెయిల్ చేస్తూ.. డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రజావాణిలో కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి. అలాంటి వారిని కాంగ్రెస్ ఉపేక్షించడం తగదు. తీన్మార్ మల్లన్నపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
Comment List