సమాజాన్ని శాంతివైపు నడిపించిన దివ్య చరితుడు "మహమ్మద్ ప్రవక్త"...!
సమాజంలో ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను బోధించిన మహమ్మద్ ప్రవక్త జన్మదినమే - "మిలాద్ ఉన్ నబి" పర్వదినం...
- పెద్దకడుబూరు మండలంలో ఘనంగా 'మిలాద్-ఉన్-నబి' పండుగ కార్యక్రమం.
న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 16 :- మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ముస్లింలు మిలాద్-ఉన్-నబీ పండుగగా జరుపుకుంటారు. సోమవారం మండల కేంద్రమైన పెద్దకడుబూరులోని ముస్లిం సోదరులు అందరూ కలిసిమెలిసి ఈ మిలాద్ ఉన్ నబి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ పండుగ సందర్బంగా మదీన మసీద్ మరియు జామియా మసీద్ నందు ఉదయం పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొని మసీద్ లో నమాజ్ చేసుకొని అల్లాహ్ దేవునికి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం మసీద్ నందు మక్కా మరియు మదీనా లోగోలను పూలతో అలంకరించుకొని, మక్కా మదీనాలను ట్రాక్టర్ వాహనంలో అమర్చి, మసీద్ దగ్గరి నుండి అల్లాహ్ జెండాలతో ముస్లింలు ర్యాలీగా బయలుదేరారు. మహమ్మద్ ప్రవక్త యొక్క నినాదాలు చదువుతూ గ్రామంలోని బస్టాండ్ ఆవరణం నుండి గ్రామ వీధులలో ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమం అయ్యాక మదీన మసీద్ లో ముస్లిం మత గురువు అబ్దుల్ రహమాన్ బయాన్ చేస్తూ సమాజంలో మహమ్మద్ ప్రవక్త చేసిన బోధనలైన ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను గురించి ముస్లింలకు వివరరించారు. ముస్లింలు అందరూ అల్లాహ్ దేవున్ని ప్రార్థిస్తూ మహమ్మద్ ప్రవక్త యొక్క అడుగుజాడల్లో నడవాలని సూచించారు. అల్లాహ్ గ్రంధం ఖురాన్ మరియు ప్రవక్త విధానం సున్నత్ లను ముస్లింలు ఆచరిస్తూ ఉన్నంతకాలం మిమ్మల్ని మంచి మార్గంలో దేవుడు నడిపిస్తాడని దైవప్రవక్త మహమ్మద్ తెలియజేశారని అన్నారు. మిలాద్ ఉన్ నబి పండుగ సందర్బంగా ముస్లిం సోదరులు మసీద్ లో ప్రత్యేక ఫాతేహాలు చేపట్టి శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వీట్లు పంచుకున్నారు. ఇస్లాం మతంలో ఈద్ మిలాద్-ఉన్-నబీ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం ఈ పండుగను సున్నీ ముస్లింలు మూడవ నెల రబీ అల్-అవ్వల్ 12వ రోజున జరుపుకుంటారు.ఇస్లాం మతాన్ని స్థాపించిన చివరి ప్రవక్త ముహమ్మద్ పుట్టినరోజునే ఈద్ మిలాద్-ఉన్-నబీగా జరుపుకుంటారు. ఈ పండుగను "మవ్లీద్" అని కూడా పిలుస్తారు మవ్లీద్ అంటే అరబిక్‌లో "పుట్టుక" అని అర్థం... అరబిక్‌లో “నబీ” అనే పదానికి “ప్రవక్త” అని అర్థం.... మొత్తంగా ఈద్ మిలాద్-ఉన్-నబీ అంటే “ప్రవక్త పుట్టిన పండుగ” అని అర్థం వస్తుంది. ముహమ్మద్ ప్రవక్త దేవుని నుంచి వచ్చిన దూత అని ముస్లింలు నమ్ముతారు, దయ, ధర్మబద్ధమైన జీవితాలను ఎలా జీవించాలో ప్రజలకు చూపించడానికే ముహమ్మద్‌ను అల్లాహ్ పుట్టించాడని విశ్వసిస్తారు.ముస్లిం సోదరులు ముహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని దైవ ఘట్టంగా జరుపుకుని ఆయన పట్ల ప్రేమను, భక్తిని చాటుకుంటారు. సమాజంలో ప్రేమ, సహనం, శాంతి, సామరస్యాలను బోధించిన మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన ఈద్-ఎ-మిలాద్ ను ముస్లింలు వివిధ రకాలుగా జరుపుకుంటారు. ప్రవక్త యొక్క జీవితం, బోధనలను ముస్లింలు శ్రద్దతో ఆచరిస్తారు...
Comment List