దళిత మహిళ గోవిందమ్మపై విచక్షణారహిత దాడి ఘటనపై - క్లియర్ కట్ వివరణ...!
దళిత మహిళ దాడి కేసులో ముద్దాయిలందరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలింపు.
గ్రామ ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కొరకు- పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ నిరంజన్ రెడ్డి వెల్లడి.
న్యూస్ ఇండియా ప్రతినిధి/ పెద్దకడుబూరు మండలం సెప్టెంబర్ 14 :- కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్లుకుంట గ్రామంలో ఈ దారుణ ఘటన జరిగింది. ఇదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో గోవిందమ్మ (ఎస్సీ మాదిగ) కుమారుడు సప్పగు ఈరన్న, ఇదే గ్రామానికి చెందినటువంటి చాకలి నాగలక్ష్మి (రజక కులము) లు ఇరువురు ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఈ ఇరు కుటుంబాలకు మనస్పర్దాలు, గొడవలు ఉన్నాయి. అందువల్ల గ్రామ పెద్దలు హరిజన గోవిందమ్మకు పరిస్థితులు చక్కబడేంతవరకు వారి తల్లితో ఎమ్మిగనూరులో ఉండమని సలహా ఇచ్చారు. అయితే గురువారం 12-9-2024 తేది సాయంత్రం యువకుడు తల్లి హరిజన గోవిందమ్మ కల్లుకుంట గ్రామంలో ఉన్న ఆమె పంట నష్ట పరిహారం కొరకు వేలిముద్ర వేయడానికి కల్లుకుంట గ్రామానికి సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో తన రెండో కుమారుడు రాజు తో కలసి వచ్చినది. గోవిందమ్మ కల్లుకుంట గ్రామంకు వచ్చిన విషయం తెలుసుకొని యువతీ నాగలక్ష్మి యొక్క కుటుంబ సభ్యులు గోవిందమ్మ ఇంటి వద్దకు వెళ్లి ఆమెను అక్కడినుండి లాక్కొని వచ్చి చాకలి నాగరాజు ఇంటి వద్ద గల కరెంటు స్తంభానికి తాడుతో కట్టి దారుణంగా హింసించారు. ఈ విషయం తెలిసిన వెంటనే గోవిందమ్మ చిన్న కుమారుడు రాజు పోలీస్ స్టేషన్ 100నెంబరు కి డయాల్ చేసి పెద్దకడబూరు ఎస్ఐ కి తెలుపగా వెంటనే ఎస్ఐ మరియు వారి సిబ్బంది కల్లుకుంట గ్రామానికి చేరుకుని నాగరాజు ఇంటి వద్దకు వెళ్లగా అక్కడ గోవిందమ్మను కరెంటు స్తంభానికి కట్టివేసి నాగరాజు కుటుంబ సభ్యులు అందరూ చుట్టుముట్టి చిత్ర హింసలు చేశారు. పోలీసులు ఆమె కట్లు విప్పదీసి పక్కకు తీసుకెళ్తూ ఉండగా, మరొకసారి నాగరాజు కుటుంబ సభ్యులు మరియు ఇతర గ్రామస్తులు అందరూ ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించారు. అతి కష్టం మీద పోలీసులు ఆమెను రక్షించి అక్కడే వేరే ఇంటిలో ఉంచి తర్వాత అక్కడి నుండి ఆమెకు ఇబ్బంది కలగకుండా పోలీస్ వాహనంలో ఆమెను గ్రామం నుంచి బయటికి తీసుకొచ్చి కోసిగి పోలీస్ స్టేషన్ పంపించడం జరిగింది. అనంతరం శుక్రవారం 13-09-24 తేదీన ఉదయం 3:30 గంటలకు గోవిందమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నేరము సంఖ్య 95/24 ఎస్సీ ఎస్టీ చట్టం కింద మరియు బిఎన్ఎస్ సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుచేయడమైనది. ఈ కేసులో పోలీసులు చేపట్టిన దర్యాప్తులో భాగంగా 13వ తారీఖున శుక్రవారం సాయంత్రం 7: 45 నిమిషాలకు హనుమాపురం బస్టాండ్ వద్ద A6-చాకలి నాగరాజు, A7-చాకలి హుస్సేనీ, A8 -చాకలి రాముడు, A9-చాకలి భీమరాజు అలియాస్ భీముడు లను అరెస్టు చేసి ఆదోని రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లో శనివారం 14-09-24 వ తారీఖున హాజరు పెట్టగా వారికి 27-9-2024 తారీఖు వరకు జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. ఆ తర్వాత శనివారం 14-9-24 తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు కల్లుకుంట గ్రామం నందు A1-చాకలి భూలక్ష్మి, A2-చాకలి నరసమ్మ ,A4-చాకలి లక్ష్మి, A5-చాకలి పెద్ద రంగమ్మ, A10-చాకలి గుండమ్మ లను అరెస్టు చేసి వారిని కూడా ఆదోని రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వద్దకు రిమాండ్ కొరకు పంపడమైనది. ఈ విచక్షణారహిత దాడి కేసులో పాల్గొన్న ముద్దాయిలను అందర్నీ అరెస్టు చేసి రిమాండ్ కు పంపించడం జరిగిందని పెద్దకడుబూరు మండలం ఎస్ఐ నిరంజన్ రెడ్డి వివరణ ఇచ్చారు.మండలంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడమైనది. గ్రామ ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ జి. బిందు మాధవ్( ఐపీఎస్ )ఆదేశాలతో యెమ్మిగనూరు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు...
Comment List