పేదలకు ప్రత్యామ్నాయం చూపించాలి
హైడ్రా తరహా వ్యవస్థ గ్రామస్థాయిలో ఉండాలి
సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రమేశ్ రాజా
పాలకుర్తి జనగాం జిల్లా:
అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు ఉపయోగిస్తున్న హైడ్రా లాంటి వ్యవస్థను గ్రామస్థాయిలో తీసుకురావాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలకుర్తి మండల కేంద్రంలో జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల సాంబయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రమేష్ రాజా ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఎలాంటి అనుమతులు లేకుండా కబ్జాలు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చివేయడం సరైన చర్యలని, అయితే.. నిరుపేదల నిర్మాణాలను తొందరపడి కూల్చివేయొద్దని ప్రభుత్వానికి సూచించారు. అత్యంత నిరుపేదలను గుర్తించి వారికి ప్రత్యామ్నయం చూపించాలని, ఆ తర్వాత వాటిని తొలగించాలని ఆయన అన్నారు. పెట్టుబడిదారులు, పెత్తందారులు, రాజకీయ భూకబ్జాదారులు ప్రభుత్వ భూముల్ని, చెరువుల్ని కుంటలని ఆక్రమించి కోట్లకు పడగ లెత్తారని అన్నారు. చెరువులు ఆక్రమించి అక్రమ వెంచర్లు చేసి, అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా ఫ్లాట్లు విక్రయించి పేదలకు అన్యాయం చేశారని తెలిపారు. అటువంటి వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో వందలాది చెరువులు, సహజ వనరులు అన్యాక్రాంతానికి దోపిడీకి గురయ్యాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల అండదండలతో ఆక్రమణలు కొనసాగాయని, అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు మరింత దోపిడీ చేసేందుకు ప్రభుత్వాలు మారినప్పుడల్లా పార్టీలు మారుతున్నారని తెలిపారు. గ్రామస్థాయిలోనూ చెరువులు, కుంటలు ప్రభుత్వ భూములు కబ్జాకబ్జాకు గురయ్యాయని, వాటిని రక్షించేందుకు సమగ్ర సర్వేలు చేసి ఆక్రమణలను కూల్చివేయాలని, తద్వారా కబ్జాలను అక్రమ నిర్మాణాలను అరికట్టాలని ఆయన అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే హడావుడి చేయొద్దని, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆస్తులను, సహజ వనరులను రక్షించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రానున్న రోజుల్లో ప్రజలను సమీకరించి ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
*లిబరేషన్ లో చేరిక
ఈ సందర్భంగా ఎమ్ ఎల్ పిఐ రెడ్ ఫ్లాగ్ నాయకులు తూర్పాటి సారయ్య, పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన కార్మిక సంఘం నాయకుడు గాయాల బాబులు లిబరేషన్ పార్టీలో చేరారు. వారికి పార్టీ నాయకులు కండువాగప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి మల్లయ్య, జీడి సోమయ్య, పోలాస సోమయ్య, మండల కార్యదర్శి కొనకటి కళింగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comment List