ఉద్యోగాలు చేయడం కాదు.. ఇవ్వండి..
ముఖ్య అతిథిగా ఇండియా స్టార్టప్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జె.ఎ. చౌదరి
ఉద్యోగాలు చేయడం కాదు.. ఇవ్వండి
* స్టార్టప్‌లను మేం ప్రోత్సహిస్తాం.. ముందుకు రండి
* ఇండియా టెక్ టాలెంట్ లీగ్‌లో వక్తల పిలుపు
* ముఖ్య అతిథిగా ఇండియా స్టార్టప్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జె.ఎ. చౌదరి
హైదరాబాద్, 12 అక్టోబర్
2023: "ఇన్నాళ్లూ మనం మన దేశంలో అపారంగా ఉన్న టాలెంటును తీసుకెళ్లి అమెరికా లాంటి విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాము. దానికి బదులు ఇక్కడివారిని ఇక్కడే ప్రోత్సహిస్తే వారు స్టార్టప్ కంపెనీలు పెట్టి విజయవంతం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇండియా స్టార్టప్ ఫౌండేషన్‌ను స్థాపించాం. ఇక్కడ స్టార్టప్‌లు మొదలుపెట్టినవారిలో కనీసం కొందరు విజయవంతం అయినా మా లక్ష్యం నెరవేరినట్లే. మన స్టార్టప్‌ల ద్వారా మరికొన్ని వేల, లక్షల స్టార్టప్ కంపెనీలు వస్తాయి. అందుకోసమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం" అని ఇండియా స్టార్టప్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆర్కిటెక్ట్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మాజీ ఐటీ సలహాదారు, మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.ఎ. చౌదరి చెప్పారు. నగరంలోని టి-హబ్‌లో నిర్వహించిన ఇండియా టెక్ టాలెంట్ లీగ్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ. ఆయనతో పాటు ఇంకా ఈ కార్యక్రమంలో టి-హబ్ సీఈఓ మహంకాళి శ్రీనివాసరావు, ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ ఛాంపియన్ విఘ్నేష్ పాండే, ఇఫిన్ గ్లోబల్ గ్రూప్ ఛైర్మన్, సీఈఓ శేషాద్రి వంగల, ఔత్సాహిక స్టార్టప్ వ్యవస్థాపకురాలు చిన్మయి డాష్ తదితరులు కూడా మాట్లాడారు.
ఈ సందర్భంగా జె.ఎ. చౌదరి మాట్లాడుతూ,... "హైదరాబాద్, చెన్నై, గుర్‌గావ్, పుణె లాంటి నగరాల్లోనే చాలావరకు టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి. ఈ అన్ని ప్రాంతాల్లోనూ కావల్సినంత టాలెంట్ ఉంది. భవిష్యత్తు టెక్నాలజీలను అందిపుచ్చుకుని స్టార్టప్‌లు పెట్టేదిశగా యువతను ప్రోత్సహించడంలో ఇంజినీరింగ్ కళాశాలలు కూడా చాలా కీలకపాత్ర పోషిస్తాయి. చదువుకునే సమయం నుంచే పిల్లలకు ఈ కొత్త టెక్నాలజీలు అలవర్చి, వారిని ఆంత్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దాలి. ఈ స్టార్టప్‌లలో కొన్ని విజయవంతమైనా కూడా ఈ ప్రాంతం మరో సిలికాన్ వ్యాలీలా తయారవుతుంది. మా ఫౌండేషన్ ద్వారా కొత్త స్టార్టప్‌లను పెట్టించడంతో పాటు వారికి బిజినెస్ కూడా అందిస్తున్నాము. దీనివల్ల కొత్త ఉద్యోగాలు కూడా లభిస్తాయి. మన దేశంలో కూడా ఒక గూగుల్, ఒక అమెజాన్, ఒక మైక్రోసాఫ్ట్, ఒక యాపిల్ లాంటి కంపెనీలు ఎందుకు రాకూడదు? అలాంటివి రావడానికి నూరుశాతం అవకాశం ఉంది. అందుకు కావల్సిన టాలెంట్ మన దగ్గర ఉంది. అందుకే మన దగ్గర నుంచి పెద్దపెద్ద ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు రావాలని మేం మా ఫౌండేషన్ ద్వారా కృషి చేస్తున్నాం. మన దేశంలో ఉన్న హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్, వాహన తయారీ, ఆస్పత్రులు.. ఇలా ఏ రంగంలో ఉన్నవారికైనా ఐటీ సేవలు తప్పనిసరిగా అవసరం అవుతాయి. ఐటీలో అత్యంత ముఖ్యమైనది టాలెంట్. అది మన దేశంలో కావల్సినంత ఉంది. ఐఐటీలు, ఐఐఐటీలు, ఇతర యూనివర్సిటీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రపంచం మొత్తానికి టాలెంట్ అందుతోంది. చాలామంది ఇప్పుడు చాట్ జీపీటీ వల్ల ఉద్యోగాలు పోతాయంటున్నారు. కానీ అది నిజం కాదు. గతంలో వై2కె సమస్య వచ్చినప్పుడు బీఏ, బీకాం చదివినవారు కూడా కోబాల్ లాంటి కోర్సులు చేసి, అమెరికా వెళ్లిపోయి ఐటీ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నేను ఐఐటీ మద్రాస్‌లో చదివేటప్పుడు ఇక్కడ ఉద్యోగాలు లేవని చాలామంది అమెరికా వెళ్లిపోయారు. నేను ఇస్రోలో ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే వచ్చింది. అప్పుడు ఐటీ ఉద్యోగాలు లేవు. కానీ ఇప్పుడు ఎన్ని కళాశాలల నుంచి ఎంతమంది వస్తున్నా, అందరికీ ఐటీ ఉద్యోగాలు వస్తున్నాయి. అలాగని కేవలం ఉద్యోగాలకే పరిమితం కాకుండా.. స్టార్టప్‌ల ద్వారా మరింత ఎదగాలన్నదే మా సూచన" అని తెలిపారు.
Comment List