కబ్జా కోరుల కబంధ హస్తాల నుండి ప్రభుత్వ భూమి విముక్తి
ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు
మున్సిపల్ కమిషనర్ రామలింగం
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాప్రా మండల్ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ అవసరాల నిమిత్తం సర్వే నంబర్ 432 లో 1500 గజాల స్థలాన్ని గతంలో షి టాయిలెట్స్ ( మహిళా మూత్రశాలలు ) కోసం కేటాయించడం జరిగింది.సర్వే నెంబర్ 432 లో గల స్థలం 1500 గజాలు ప్రధాన రహదారి పక్కనే ఉండి కోట్ల విలువ కలిగి ఉండడంతో కొంతమంది భూకబ్జాదారులు గతంలో కబ్జాకు యత్నించగా పెద్ద వివాదం రాచుకుంది. ఈ ఘటనలో సీఐ బిక్షపతి రావు పై పెట్రోల్ దాడికి యత్నించి, మున్సిపల్ అధికారులను, రెవెన్యూ అధికారులను భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా నిలిచింది. ఇలాంటి ఎన్ని సంఘటనలు జరిగినా షరా మామూలే అన్న విధంగా జవహర్ నగర్ లోని భూకబ్జాదారులు ఎలక్షన్ల సమయాన్ని అదునుగా చేసుకొని ప్రభుత్వం ప్రజా అవసరాలకు కేటాయించిన భూములను రాత్రికి రాత్రి చదును చేస్తూ పెద్ద పెద్ద లారీలతో ఆ స్థలాలలో మట్టిని నింపి యదేచ్చగా కబ్జాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహిళల మూత్రశాల ( షీ టాయిలెట్స్ ) సర్వేనెంబర్ 432లో కబ్జారాయుళ్లు సుమారు 20 కోట్లు విలువచేసే భూమిని చదును చేసి మట్టిని నింపి షీ టాయిలెట్ కోసం కేటాయించిన బోర్డు ఫ్లెక్సీ ని చింపివేసి. ఆ స్థలంలో డబ్బా ని ఏర్పాటు చేసి గృహ నిర్మాణానికి ఉపయోగించే వస్తువుల ను ఆ స్థలంలో ఉంచి దుకాణంగా మలిచే ప్రయత్నం చేస్తుండగా, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు సమాచారం అందగా,కమిషనర్ రామలింగం ఆదేశాల మేరకు మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఆ స్థలంలో ఉన్న డబ్బాను రూములను తొలగించారు. ప్రభుత్వం ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే సహించేది లేదని వారిపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని కమిషనర్ రామలింగం హెచ్చరించారు. సర్వేనెంబర్ 432 లోని 1500 గజాల స్థలం లో అక్రమ నిర్మాణాలను, డబ్బాలను తొలగించడంపై జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలు కమిషనర్ కు ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.
Comment List