పేద రైతులకు స‌ర్వ‌ హక్కులు కల్పించింది మీ బిడ్డ ప్రభుత్వమే : సీఎం జగన్

రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను, వ్యవసా­యం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు

By Teja
On
పేద రైతులకు స‌ర్వ‌ హక్కులు కల్పించింది మీ బిడ్డ ప్రభుత్వమే : సీఎం జగన్

నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అంటుంటే పెత్తందారలకు నచ్చటంలేదు.. దొంగల ముఠా మాట‌లు నమ్మి మోసపోవదు.. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడు సీఎం అవ్వలేదు

పేదల భూముల‌పై వారికి స‌ర్వ‌ హక్కులు కల్పించింది మీ బిడ్డ ప్రభుత్వమే అని సీఎం జగన్ పేర్కొన్నారు.  రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపించామ‌ని, 2003 నాటి అసైన్డ్‌ భూములకు హక్కు కల్పిస్తున్నామ‌ని, కొత్తగా డీకేటి పట్టాలను అందిస్తున్నామని చెప్పారు. పేదవాళ్లకు వెన్నుదన్నుగా ఉంటే పెత్తందార్లకు నచ్చడం లేదని ఆరోపించారు. పేదవర్గాల పట్ల బాధ్యతగా చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నామ‌న్నారు. మొదటి దశలో 18లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామని, రెండో దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశామని, నాలుగు వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయిందని, సర్వే పూర్తైన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చుని, భూ తగాదాల సమస్యలను పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్‌డేట్‌ చేశామని తెలిపారు. వేల మంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నామని, అసైన్డ్‌ భూములకు భూ హక్కులు కల్పిస్తున్నామని, చుక్కల భూములకు సైతం పరిష్కారం చూపించామ‌న్నారు. 

ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జ‌గ‌న్‌ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారం­భించడంతోపాటు అసైన్డ్‌ భూములకు యా­జమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూ­ములు, సర్వీస్‌ ఈనాం భూములను 22 ఏ జా­బితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూము­లపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీని సీఎం జగన్‌ ఈ సభలో ప్రారంభించారు. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం  రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలోనే ఎప్పటికీ కూడా గొప్పగా నిలబడే రోజుగా ఇది జరుగుతుందని, కారణం ఏంటంటే దశాబ్ధాలుగా కేవలం అనుభవదారులుగా ఉన్న రైతులకు, వారు సాగు చేసుకుంటున్న భూములపై చట్టబద్ధంగా హక్కులు ఇచ్చే కార్యక్రమం జరుగబోతోందని, ఇదొక్కటే కాకుండా కొత్తగా డీకేటీ పట్టాలు ఇచ్చే విషయం కూడా ఈ సందర్భంగా జరుగబోతోందని సీఎం జగన్ తెలిపారు. మీ బిడ్డ ప్రభుత్వంలో జరుగుతున్న పనులను, 53 నెలల పరిపాలనను ఒకసారి గమనిస్తే.. గతంలో ఎప్పుడూ చూడని విధంగా ముందడుగులు పడుతున్నాయని అన్నారు. 

నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు అంటుంటే పెత్తందారలకు నచ్చటంలేదు

Read More మన్నేపల్లి వారి వివాహ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి ఇన్చార్జి దద్దాల

"ఈ రోజు గర్వంగా చెబుతున్నాను..నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు..నా నోట్లో నుంచి ఈ మాటలు ఎప్పుడు వచ్చిన కూడా ఆ పేదవాడిపై ప్రేమ చూపిస్తూ ఎప్పుడు మాట్లాడినా కూడా..ఇలాంటి ప్రేమ, పిలుపు పెత్తందార్లకు నచ్చదని నాకు తెలుసు.
నా పిలుపులోనూ, నా మనసులోనూ మాత్రమే కాకుండా 53 నెలల పరిపాలన చూస్తే నా చేతల్లో కూడా ఈ వర్గాల పట్ల ఎంత చిత్తశుద్ధితో వ్యవహరించామో ఈ కార్యక్రమం గొప్పగా కనిపిస్తోంది" అని సీఎం ఆనందం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో వందేళ్ల తరువాత మన ప్రభుత్వం ఆధ్వర్యంలో రీ సర్వే కార్యక్రమం చేస్తున్నామని, 17406 రెవెన్యూ గ్రామాల్లో మొదట రెండు దశల్లో ఏకంగా 4 వేల గ్రామాల్లో భూముల రీ సర్వే కార్యక్రమం విజయవంతం చేశామని, మరో విడతగా 2 వేల గ్రామాల్లో పూర్తి చేసి ఇవాళ మూడో విడత కార్యక్రమం మొదలుపెడుతున్నామని  మొత్తంగా 42.60 లక్షల ఎకరాల్లో రీ సర్వే పూర్తి అయ్యింది. భూ హక్కు పత్రాలు అందజేశామని, 45 వేల సరిహద్దు తగాదాలు పరిష్కరించామని చెప్పడానికి గర్వపడుతున్నాని అన్నారు. 4 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి ఈ గ్రామాల్లో 43.33 లక్షల కమతాలను నిర్ధారిస్తూ వాటి సరిహద్దులు నిర్ణయిస్తూ సరిహద్దు రాళ్లు పాతడం పూర్తి చేశామని, గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నది మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయని ఉద్ఖాటించారు. భూ తగాదాలకు పరిష్కారం చూపుతూ రికార్డులు అప్‌డెట్‌ చేశామని. 15 వేల మందికి పైగా ఈ రోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో సర్వేయర్లు నిమగ్నమై రైతులకు మంచి చేసేందుకు అడుగులు ముందుకు వేసే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. 

రెండో అంశం  20 ఏళ్లకు పైగా అసైన్డ్‌ భూములపై లబ్ధిదారులకు సర్వహక్కులు కల్పించే కార్యక్రమం మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతున్నాయని, దీని వల్ల 27.42 లక్షల ఎకరాలకు సంపూర్ణ హక్కులు కల్పించగా 15.41 లక్షల మంది పేద రైతులకు మంచి జరుగబోతోందని ఆలోచన చేయాలని ప్రజలను కోరారు.ప్రధానంగా పేద సామాజిక వర్గాలకు మంచి జరిగే గొప్ప కార్యక్రమమని, ఇదీ పెత్తందార్ల పోకడలపై మీ బిడ్డ ప్రభుత్వం సాధించిన విజయంగా ఎప్పటికీ నిలిచిపోతుందని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు హయాంలో అసైన్డ్‌ భూములు తన అత్తగారి సొత్తు అన్నట్లుగా ఆక్రమించుకున్నారని, ఈ రోజు ఆ అసైన్డ్‌ భూముల హక్కులను పూర్తిగా ఆ పేదవాడికి ఇస్తున్నామని చెప్పారు.

మూడో అంశం.. చుక్కల భూమలను నిషేధిత జాబితా నుంచి తొలగించడం అని, బ్రిటిష్‌ పాలనలో రీ సర్వే అండ్‌ సెటిల్‌మెంట్‌ రిజిస్ట్రర్‌లో నమోదు చేసే సమయంలో వివరాలు అందుబాటులో లేని భూములను చుక్కల భూములుగా చూపారని, గత చంద్రబాబు పాలనలో 2016లో 22ఏ జాబితాలో చేర్పించారని గుర్తు చేశారు. రైతులు అల్లాడిపోయారని భూములున్నాయని కానీ, హక్కులు లేవని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం చంద్రబాబు ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చటమేనని, 2.6 లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడంతో 1.2 లక్షల మంది రైతులకు మంచి జరిగించామని, ఇదీ కూడా మీ బిడ్డ పాలనలోనే జరిగిందని ఉద్ఘాటించారు.

నాలుగో అంశం..పేదవాడికి భూ హక్కులు కల్పించేందుకు మీ బిడ్డ ప్రభుత్వం ఎంత గొప్పగా అడుగులు వేశాడని చెప్పడానికి ఇంకో ఉదాహరణ ఇది. షరతులు గల పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించింది కూడా మీ బిడ్డ ప్రభుత్వమేనని, 
అప్పుడెప్పుడో 1934లో రీ సర్వే రిజిస్ట్రర్‌ రిమాక్స్‌ కాలమ్‌లో షరతులు గల పట్టాగా నమోదు చేసి ఆ భూములను కూడా ఆ రైతులకు కూడా హక్కులు ఇవ్వని పరిస్థితిలో ఉండగా, వారికి మంచి చేసేందుకు షరతులు గల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ రైతులకు విముక్తి కలిగిస్తూ ఏకంగా 33,394 ఎకరాలు సాగు చేసుకుంటున్న 22,042 మంది రైతులకు మంచి జరిగిస్తూ సర్వహక్కులను ఆ పేదవాడి చేతుల్లో పెట్టిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడుతున్నానని అన్నారు.

ఐదో అంశం..పేదవాడి కోసం తపిస్తూపేదవాడికి భూ హక్కులు కల్పిస్తూ ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా కొన్న భూముల మీద లోన్లుగా రాసుకున్నారు. ఆ భూములపై హక్కులు కోల్పోయిన ఎస్సీ రైతుల రుణాలు మాఫీ చేస్తూ వారికి సర్వ హక్కులు కల్పించింది కూడా మనందరి ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడుతున్నాను. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా 22,387 ఎకరాలను నిరుపేదలైన 22346 మంది దళితులకు పంపిణీ చేసిన ఆ భూములన్నింటిని కూడా ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా తాకట్టు పెట్టిన భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి, ఆ రుణాలు మాఫీ చేసి ఆ రైతులకు పూర్తి హక్కులు కల్పించామని చెప్పుకోచ్చారు.

ఆరో అంశం.. ప్రతి పేదవాడికి ఎంపవర్‌ చేయాలని, చెయ్యి పట్టుకొని నడవాలని గిరిజనులకు మంచి చేసేందుకు ఆర్‌వోఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ చేపట్టామని, కొండల్లో నివాసం ఉంటున్న గిరిజన సోదరులకు సాగు హక్కులు కల్పిస్తూ 1,56,655 గిరిజన కుటుంబాలకు మంచి జరిగిస్తూ 3,26,982 ఎకరాలను పంపిణీ చేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని ఆనందం వ్యక్తం చేశారు.

ఏడో అంశం.. లంక భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ఎలాంటి పట్టాలు లేకపోవడంతో వారికి లోన్లు ఇచ్చే పరిస్థితి లేదని, ఏ సహకారం అందడం లేదని, తరతరాలుగా లంక భూములు సాగుచేసుకుంటున్న రైతులను గుర్తించి వారికి డీకేటీ, లీజ్‌ పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎంజాయ్‌మెంట్‌ సర్వే ద్వారా నిర్ధారించి ఏ, బీ కేటాగిరిలకు డీకేటీ పట్టాలు, సీ, డీ కేటగిరిలో లీజ్‌ పట్టాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని, 17,760 మంది నిరుపేదలకు మంచి జరిగిస్తూ ఈ రోజే ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నామని అన్నారు.

ఎనిమిదో అంశం.. సర్వీస్‌ ఈనాం భూములను నిషేధిత జాబితా కింద పెట్టారని, వీటి అన్నింటిని కూడా గ్రామ ఇనాం భూములన్నింటిని కూడా నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశమని, ఆ భూములకు సంబంధించి 1,61,584 మంది నా రైతులకు మరి ముఖ్యంగా కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగళి,తదితర వృత్తుల వారీకి మంచి జరిగిస్తూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ వారి భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ వారికి పూర్తి హక్కులు ఇచ్చామని సీఎం జగన్ చెప్పారు.
 
తొమ్మిదో అంశం..పేదలకు భూములకు సంబంధించి మరో ముఖ్య నిర్ణయం తీసుకున్నామని, ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మరో 42307 మంది నిరుపేదలకు అక్షరాల 46463 ఎకరాల భూ పంపిణీ చేసే కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నామని, దీని వల్ల నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేద వర్గాలకు మంచి చేసే అడుగులు ఇక్కడి నుంచి పడుతున్నాయని చెప్పారు.

"ఇలా 53 నెలల పాలనలో భూములకు సంబంధించి ప్రతి పేదవాడిని చెయ్యి పట్టుకుని నడిపించేందుకు 9 అంశాలు చెప్పాను. మన పేదల కోసం ఏ పెత్తందారి ప్రభుత్వం గతంలో ఎప్పుడు చేయని విధంగా భూములపై సర్వ హక్కులు పేదవాడికి ఇచ్చే అంశం, కొత్తగా డీకేటీ పట్టాలు ఇచ్చింది మన ప్రభుత్వంలోనే.. రాష్ట్రవ్యాప్తంగా అక్షరాల 35,44,866 ఎకరాలకు సంబంధించి 20,24,709 మంది పేదలకు హక్కులు కల్పించి వారి చేతుల్లో పెట్టిన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వమే అని ఈ రోజు సగర్వంగా తెలియజేస్తున్నాను. 
ప్రతి పేదవాడు కూడా కాలర్‌ ఎగరేసి అదిగో మా అన్న..మా అన్న ప్రభుత్వం మా ప్రభుత్వం..మా కోసం ఆలోచన చేసేవాడు ఒకడు ఉన్నాడని చెప్పుకునే విధంగా మీ బిడ్డ పాలన సాగిందని చెప్పడానికి గర్వపడుతున్నాను" అని సీఎం జగన్ అన్నారు

శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు

ప్రతి పేదవాడి గురించి ఆలోచన చేస్తూ.. ఇంకో గొప్ప అడుగు పడిందని, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయినా కూడా ఎస్సీ వర్గాలకు శ్మశానవాటికలు లేవని, అంతిమ సంస్కారాల విషయంలో కూడా అంటరానితనం పాటించే విషయం ఉంటే మనుషులుగా మనం ఏం ఎదిగామని ఆలోచన చేయాలి. మొత్తంగా శ్మశాన వాటికల కోసం 1854 గ్రామ సచివాలయాల పరిధిలో 1250 ఎకరాలు అవసరమని నివేదికలు ఇచ్చారని, 1563 సచివాలయాల పరిధిలో ఇప్పటికే 951 ఎకరాల భూమిని సేకరించి గ్రామపంచాయతీలకు అప్పగించామని ఇంత చిన్న విషయాన్ని కూడా పరిశీలించి మేలు చేస్తున్నామని చెప్పారు. మనందరి ప్రభుత్వం దేశ చరిత్రలో ఎక్కడా కూడా కనివినీ ఎరుగని విధంగా భూములపై పూర్తి హక్కులు ఇచ్చిందంటే దానికి కారణం, పేదలు, రైతుల గుండె చప్పుడు విన్న ప్రభుత్వం కాబట్టే ఇవన్నీ కూడా మనసు పెట్టి చేసిందని, మనందరి ప్రభుత్వంలో సామాజిక న్యాయం నినాదంగా కాదు.. ఒక విధానంగా అమలు చేస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. నా పేద వర్గాలను అక్కున చేర్చుకొని సామాజిక, ఆర్థిక న్యాయం చేయగలిగామని, నేరుగా బటన్‌ నొక్కడం, నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా రూ.2.40 లక్షల కోట్లు పంపించానని ఉద్ఘాటించారు. 

ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎనాడూ సీఎం కాలేదు: సీఎం

"గత ముఖ్యమంత్రి లాగా కాదు..తన వర్గం కోసం, తన వాళ్ల కోసం, తన గజదొంగల ముఠా కోసం పేదల ప్రయోజనాలను తాకట్టుపెడితే జరిగేది సామాజిక న్యాయం కాదు..సామాజిక అన్యాయం అవుతుంది. తన గజ దొంగల ముఠా కోసం, జన్మభూమి కమిటీల కోసం దోచుకున్నది పంచుకోవాని కోరుకునే వ్యక్తి సీఎం స్థానంలో కూర్చుంటే రైతులకు ఎంతగా అన్యాయం చేస్తాడో మనం చూశాం.  2014 నుంచి 2019 వరకు ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ఎంత మందిని మోసం చేశారో చూశాం. ఇవన్నీ గుర్తుకు తెచ్చుకోండి. చంద్రబాబు ఏనాడు కూడా ప్రజలకు మంచి చేసి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేదు. తాను తీసుకొచ్చిన మంచి స్కీముల వల్లనో, లేక తాను చేసిన మంచి పనుల వల్లనో ఈ బాబు ఏనాడు కూడా సీఎం కాలేదు. కూతురును ఇచ్చిన మామ ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి మొట్టమొదటిసారి చంద్రబాబు సీఎం అయ్యాడు. రెండోసారి అప్పట్లో కార్గీల్‌ యుద్ధం పుణ్యానా సీఎం అయ్యాడు. మళ్లీ మూడోసారి సీఎం అయ్యి.. ప్రజలకు ఇంద్రలోకాన్ని చూపించాడు. రైతుల రుణాలు మాఫీ చేస్తానని, పొదుపు రుణాలు మాఫీ చేస్తానని నమ్మించాడు. చదువుకుంటున్న పిల్లలను కూడా వదల్లేదు. ఇంటింటికీ ఓ ఉద్యోగం..ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2వేల నిరుద్యోగ భృతి అన్నాడు. జాబు రావాలంటే బాబు రావాలన్నారు. ఎంతగా రైతులను, అక్కచెల్లెమ్మలను, చదువుకుంటున్న పిల్లలను మోసం చేశాడో, అవ్వతాతలను కూడా వదల్లేదు. అందుకే 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు గూబ గువ్వ్‌ అనిపించేలా తీర్పు ఇచ్చారు. సౌండ్‌ కూడా రీ సౌండ్‌ వచ్చేలా 151 స్థానాల్లో మీ బిడ్డను గెలిపించారు" అని సీఎం జగన్ దుయ్యబట్టారు.

రాబోయే రోజుల్లో అబద్ధాలు ఎక్కువవుతాయని, మోసాలు ఎక్కువవుతాయని, ఇదే చంద్రబాబు నోట్లో నుంచి, ఆయన గజదొంగల ముఠా, దత్తపుత్రుడు అందరూ ఏకమై ప్రజలను మోసం చేసేందుకు అడుగులు వేస్తారని, ప్రతి ఇంటికి బెంజికారు ఇస్తామంటారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామంటారని, ప్రజలు మోసపోవద్దని.. అబద్ధాలను నమ్మద్దని సూచించారు. గతంలో ఇదే పెద్దమనుషులు కలిసి వచ్చి 2014లో ఏం చెప్పారో జ్ఞాపకం చేసుకోమన్నారు. చెప్పిన ఆ మాటలు చేశారా? లేదా అన్నది ఆలోచించుకోమన్నారు. విజ్ఞతతో అడుగులు ముందుకు వేయాలని ప్రజలకు సూచించారు.
 
వీళ్ల మాదిరిగా అబద్ధాలు చెప్పడం మీ బిడ్డకు చేతకాదని, కుట్రలు చేయడం చేతకాదని, కుతంత్రాలు పన్నడం అంతకన్నా చేతకాదని.. మీ బిడ్డ మోసం చేయడని, అబద్ధాలు ఆడడని, ఇది మాత్రం కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని కోరారు. ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని, తోడేళ్లన్ని ఏకమవుతున్నాయని, మీ బిడ్డకు పచ్చి మీడియా, దత్తపుత్రుడి సపోర్టు లేదని అన్నారు. "అబద్ధాలు నమ్మకండి, మోసాలను గమనించండి..మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగిందా? లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి. మంచి చేస్తూ అనేక అడుగులు వేయగలిగాను. మీ చల్లని దీవెనలు, దేవుడి ఆశీస్సుల వల్ల గొప్ప అడుగులు వేయగలిగాను. రోబోయే రోజుల్లో ఇంకా గొప్ప అడుగులు పడుతాయి."అని సీం జగన్ ప్రజలను విజ్ఙప్తి చేశారు 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Views: 9

About The Author

Post Comment

Comment List

Latest News