గ్రామ సర్పంచ్ ను సైడ్ చేసి ఇష్టానుసారంగా పైప్ లైన్లు..?
అనుమతులు లేకుండా త్రాగునీటి కొళాయిల కోసం సిసి రోడ్డుకి గండి...
- గ్రామంలో ఏం జరిగిన స్పందన లేని మండల అధికారులు.
న్యూస్ ఇండియా / పెద్దకడుబూరు మండలం అక్టోబర్ 29 :- పంచాయతి అధ్యక్షుడిని సర్పంచ్ అని అంటారు. స్థానిక స్వయం పరిపాలన ఒక చట్టబద్ధమైన సంస్థ. ఒక గ్రామ స్థాయిలో ప్రధముడిగా ఇతనిని ఎన్నుకుంటుంది. సర్పంచ్ ప్రభుత్వ అధికారులకు, గ్రామీణ సమాజానికి మధ్య పరిచయ కేంద్ర స్థానంగా ఉంటారు. సర్పంచ్ అనగా గ్రామ నిర్ణయ రూపకర్తల పెద్ద అని అంటాము. అయితే 2024 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టినప్పటి నుండి గ్రామ సర్పంచ్ ల అనుమతులు లేకుండా మంత్రాలయం నియోజకవర్గం పెద్దకడుబూరు మండలంలో యదేచ్చగా త్రాగునీటి కొళాయిల పైప్ లైన్ల కోసం సిసి రోడ్డులను గండి కొట్టి ధ్వంసం చేస్తున్నారని సీపీఐ నాయకులు మరియు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మబ్బు ఆంజినేయ తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం పత్రిక ప్రకటనలో సీపీఐ నాయకులు మబ్బు ఆంజినేయ మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి సంభందించి ప్రజలచే ఎన్నుకోబడిన గ్రామ సర్పంచ్ ను సైడ్ చేసి ఆయన అనుమతులు లేకుండా గ్రామంలో పలు చోట్ల రోడ్లు ధ్వంసం చేసి ఎవరికి ఇష్టమోచ్చినట్లు వాళ్ళు కొళాయి పైపులు వేసుకోవడం ఏంటని ప్రశ్నించారు. ఒకవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నమాటలు రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలలో ఉన్న సర్పంచ్ లను గౌరవ పదంతో చూస్తూ గ్రామాలలో సర్పంచ్ లతో కలిసి పార్టీ నాయకులు అభివృద్ధి కార్యక్రమాలు చెప్పట్టాలని సర్పంచ్ లకు ఎంతో ప్రాముఖ్యతను కల్పిస్తున్నారని అన్నారు. కానీ ఇందుకు విరుద్దంగా మండలంలోని కొందరు నేతల అండదండలతో పెత్తనం చాలయిస్తూ పలువురు వ్యక్తులు గ్రామంలోని కాలనీలలో పైప్ లైన్ కొళాయిలు వేసి ఒక్కో కోలాయికి దాదాపు 1500 రూపాయల చొప్పున ఆ కాలనీ వాసులు దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నారని వెల్లడించారు. గ్రామ పంచాయతీ పరిధిలో ఎవ్వరైనా గ్రామానికి సంభందించిన ఏవైనా పనులు, కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్నప్పుడు గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి అనుమతులతోనే ముందుకు సాగాలని, ఇలా ఇష్టానుసారంగా ఎవ్వరికి ఇష్టమొచ్చినట్లు వాళ్లు కొళాయిల కోసం సిసి రోడ్లను ధ్వంసం చేయడం సరికాదని పేర్కొన్నారు. మండలోని గ్రామలలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పెత్తనం చాలాయిస్తున్న వ్యక్తులపై మండల స్థాయి అధికారులు స్పందించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గ్రామ సర్పంచ్ మరియు పంచాయతీ కార్యదర్శి లతో గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను సాగించాలని మండల అధికారులను కోరారు. ఈ విషయంలో మండల స్థాయి అధికారులు స్పందించక పోతే సిపిఐ పార్టీ తరుపున సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు...
Comment List