గురుకుల పాఠశాలలో దారుణం
బాలికపై క్యాటరింగ్ వర్కర్ లైంగిక వేధింపులు
పాలకుర్తిలోని గురుకుల పాఠశాలలో ఘటన
పాలకుర్తి: జనగామ జిల్లా పాలకుర్తిలోని గురుకుల పాఠశాలలో క్యాటరింగ్ వర్కర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల కేంద్రంలోనీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకుంటున్న బాలికపై క్యాటరింగ్ వర్కర్ నిత్యం లైంగికంగా వేధించడంతో ఆ మైనర్ బాలిక సెలవులకు ఇంటికి వెళ్లి తిరిగి పాఠశాలకు రాకపోవడంతో విషయం బయటకు వచ్చింది. పాఠశాలకు ఎందుకు వెళ్లడం లేదని బాలిక తల్లిదండ్రులు ప్రశ్నించగా గురుకుల పాఠశాలలో క్యాటరింగ్ వర్కర్ గా పనిచేస్తున్న వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాలిక తల్లిదండ్రులకు వివరించింది. దీంతో బాలిక తల్లిదండ్రులు గురుకుల పాఠశాలకు వచ్చి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ తో పాటు క్లాస్ టీచర్ ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని తమకి ఏమి తెలియదు అంటూ దాటవేశారని తెలిపారు. దీంతో వేధింపులకు పాల్పడిన క్యాటరింగ్ వర్కర్ పై పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా మైనర్ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Comment List