10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఖమ్మం, జూన్ 21: యోగ కొందరిది కాదని.. ఇది అందరిదని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. యోగ ఒక కులం, మతం, వర్గం, భాషకు సంబంధించింది కాదని ఎన్నో ఏళ్ల నుంచి తరతరాలుగా వస్తుందని పెద్దలు ఇచ్చిన ఆస్తిగా యోగాను కలెక్టర్ అభివర్ణించారు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవంసందర్భంగా, శుక్రవారం స్థానిక సర్దార్ పటేల్ స్టేడియం లో జిల్లా ఆయుష్, నెహ్రూ యువ కేంద్ర, యువజన క్రీడల శాఖలు సంయుక్త ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రాజగోపాల్ తో కలిసి కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం యోగ సాధకులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడారు. మనమందరం ఆరోగ్యంగా ఉండాలంటే శారీరకమైన శ్రమ ఒక్కటే సరిపోదని, మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలన్నారు. ఆందోళనలు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా ఆసనములు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఏ సమస్యకైనా పరిష్కరించే ధైర్యం యోగ మాత్రమే అన్నారు. వివిధ రకాల వ్యాయామాలతో మానసిక దృఢత్వాన్ని పొందుతామని తద్వారా పూర్తి ఆరోగ్యంగా జీవిస్తామన్నారు. సమయం కుదరడం లేదని అంటుంటారని పరిస్థితిని బట్టి ఒకటి, రెండు నిమిషాలు కూడా యోగ చేయవచ్చన్నారు. ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతత పొంది శరీర దృఢత్వం రావాలంటే యోగ తప్పనిసరి అన్నారు. 2024 సంవత్సరానికి అంతర్జాతీయ యోగా దినోత్సవమును యోగ ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ గా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈరోజు నుండి తప్పకుండా ఎంతో కొంత సమయం యోగా కోసం కేటాయించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి సునీల్ రెడ్డి, లక్ష్మి నారాయణ, డా. రాంచందర్ రావు, డాక్టర్ రవికుమార్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ స్వామి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comment List